August 19, 2014

తెలంగాణా విద్యార్తులకు ఆర్ధిక సాయం (ఫాస్ట్) & ప్రతిపాదిత పథకం యొక్క 1956 కటాఫ్ తేదీ

తెలంగాణా విద్యార్తులకు ఆర్ధిక సాయం (ఫాస్ట్) & ప్రతిపాదిత పథకం యొక్క 1956 కటాఫ్ తేదీ గురించి నేను ఆంగ్లంలో రాసిన టపాను పలువురు మెచ్చుకున్నారు. మిత్రులు కొండలరావు గారు దీన్ని తెలుగులో అనువదిస్తే బాగుంటుందని సూచించారు. వారి కోరిక మేరకు టపా నిడివి కుదించి తర్జుమా చేసి ప్రచురించడం ద్వారా తెలుగు బ్లాగ్లోకంలో అడుగు పెడుతున్నాను.

నన్ను తెలుగులో రాయమని ప్రోత్సహించిన పెద్దలు శ్యామలీయం మాస్టారు గారికి ధన్యవాదాలు. నేను తెలుగులో రాయగలనో లేదో అన్న సంశయం వారి ప్రోత్సాహం వల్ల తగ్గింది. థాంక్స్ లాట్ సార్.

నేను రాసిన తెలుగు వ్యాఖ్యలు బాగున్నాయని సోదరులు గుండు మధుసూదన్ గారు వెన్ను తట్టారు. మధు అన్నకు నా ధన్యవాదాలు.

ముఖ్య గమనిక: టపాలో అనువాద లోపాలు దొర్లవచ్చు. మూలంలో వాడిన భాష నా ఆంగ్ల టపాలో చూడ ప్రార్తన.

ముందుమాట
తెలంగాణా ప్రభుత్వం "ఫీజు రీ-ఇమ్బర్సుమెంటు" పథకాన్ని 1956 కంటే ముందటి నుండి ఉన్న తెలంగాణా నివాసీయులకు మాత్రమె అమలు చేయదలిచిందన్న వార్తలపై ఎన్నో రోజులుగా దుమారం చెలరేగుతుంది. దరిమిలా ఎదురు చూస్తున్న జీవో వచ్చినట్టే అనిపిస్తుంది.

ఊహించినట్టే సీమాంధ్ర రాజకీయనాయకులు ప్రతిపాదనపై గట్టి అభ్యంతరం చెప్పారు. మంత్రి రావెల కిషోర్ బాబు గారు ఈ పథకం రాజ్యాంగ వ్యతిరేకమని, రాజ్యాంగం ప్రాంతం ఆధారంగా వివక్ష చూపరాదని చెబుతుందని అన్నారు. తాను తమ రాష్ట్ర ముఖ్య న్యాయవాదితో సంప్రదించానని & న్యాయపరమయిన చర్యలు చేపడుతామని ఆయన చెప్పారు.

తెలంగాణా అవతరణ చట్టంలో అడ్మిషన్ సంబంధ అన్ని విషయాలను పదేళ్ళు యథాతథంగా కొనసాగాలని ఉందని, ఈ నియమాన్ని ఫాస్ట్ అతిక్రమిస్తుందని కూడా మంత్రి గారి వాదన.

ఇంతకీ జీవోలో ఏముంది? ప్రతిపాదిత పథకం మార్గదర్శకాలు కోసం ఒక ఉన్నతాధికారుల కమిటీ వేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. వివాద మూలాంశం సెక్షన్ 4లొ పేర్కొన్నా అది ఇప్పుడే అమలు కాలేదు. అదేమిటో కూడా చూద్దాం (స్వేచానువాదం):

"ఫాస్ట్ 2014-15 వి.సం. నుండి అమలులో వస్తుంది. ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్తులు మరియు ఇకముందు జరిగే ప్రవేశాలకు ఫాస్ట్ పథకం వర్తిస్తుంది. నవంబరు 1, 1956 నాటికి తెలంగాణాలో యదార్ధ స్థిర నివాసం ఉన్నవారి పిల్లలు/మనవలు పథకం లబ్ది అర్హత పొందుతారు. అర్జీదారులు నియమిత ఫార్మాటులో ఇచ్చిన సమాచారాన్ని ధ్రువీకరించిన పిమ్మట రెవెన్యూ శాఖ అధికారులు బోనాఫైడు సర్తిఫికెటులు జారీ చేస్తారు".

ఉత్పన్నమయ్యే ప్రశ్నలు
"ఫీజు రీ-ఇమ్బర్సుమెంటు" పథకం ఇటీవలి కాలంలో వచ్చింది. అంతక ముందు (ఉ. చంద్రబాబు నాయుడి మొదటి రెండు హయాములలో) ఇలాంటి పథకం లేదు. తెలంగాణా ప్రభుత్వం పథకాన్ని ఇప్పటికే రద్దు చేసింది. కొత్త పథకం రూపు రేఖలు ఇంకా వెలువడలేదు. అంచేత ఇంకా దీన్ని న్యాయస్థానాలలో ఎదురుకోవడం కుదరదు. అయితే ప్రభుత్వం తన లక్ష్యాన్ని స్పష్టంగానే ప్రకటించినట్టు అనిపిస్తుంది. జీవో 36 సెక్షన్ 4 ప్రకారమే రాబోయే ఫాస్ట్ పథకం ఉంటుందని భావిస్తే కింది ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి:

·         పథకాన్ని న్యాయస్థానంలో ఎదిరించే హక్కు సీమాంధ్ర ప్రభుత్వానికి ఉందా?
·         పథకం రాజ్యాంగ వ్యతిరేకమా?
·         పథకం తెలంగాణా ఆవిర్భావ చట్టాన్ని ఉల్లంఘిస్తుందా?

సీమాంధ్ర ప్రభుత్వం స్తాయి (locus standi)
కొన్ని సందర్భాలలో ప్రభుత్వం ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకోవొచ్చు. Parens patriae అనబడే సూత్రం కింది సీమాంధ్ర ప్రభుత్వం జోక్యం చేసుకోగలదా?

2009 సుచితా శ్రీవాస్తవ కేసు సర్వోచ్చ న్యాయస్థానం తీర్పులో గౌ. ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ ఇలా పేర్కొన్నారు: " సూత్రం కింద తమను తాము చూసుకోలేని వారి తరఫున ప్రభుత్వం నిర్ణయం తీసుకోవొచ్చు". ఫాస్ట్ పథకంపై షికాయతులు వచ్చే వ్యక్తులు అందరూ విద్యార్తులు, కొండొకచో విద్యాధికులు కూడా. డీపీ జోషీ (వివరాలు కిందగలవు) లాంటి వేలాది మంది విద్యార్తులు గతంలో న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఒకవేళ ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా వీటికి ప్రో-బోనో లాంటి ఎన్నో పరిష్కారాలు దండిగా ఉన్నాయి. అంచేత సీమాంధ్ర సర్కారు ఈ వ్యాజ్యంలో "తమను తాము చూసుకోలేని వారు" అనే పరీక్ష పాస్ కాదు.

సీమాంధ్ర రాజకీయ నాయకులు చెబుతున్న కారణాలు పరిశీలిస్తే వారు సీమాంధ్ర విద్యార్తుల గురించి మాత్రమె మాట్లాడుతున్నారని తేటతెల్లం అవుతుంది. వారి వాదనను ఒప్పుకుంటే మిగిలిన (ముఖ్యంగా కర్నాటక & మహారాష్ట్ర) ప్రభుత్వాలకు కూడా హక్కు ఇవ్వాలి. ప్రతిపాదిత ఫాస్ట్ పథకం "బాదితులు" అందరికీ సీమాంధ్ర ప్రభుత్వం ప్రతినిధి కాజాలదు.

ప్రజల తరఫున ప్రభుత్వ వకాల్తా సూత్రానికి కావాల్సిన మరో ముఖ్యమయిన షరతు సుచితా శ్రీవాస్తవ కేసులో న్యాయస్థానం ఇలా చెప్పింది: " చర్య ఉద్దేశ్యం బాదితుల ప్రయోజనాల రక్షణ మాత్రమె అయి ఉండాలి తప్ప సమాజ శ్రేయస్సు లాంటి ఇతర ప్రయోజనాలు కాదు". సీమాంధ్ర & ఇతర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఈ పరీక్ష పాస్ కాదని కింది కారణాల దృష్ట్యా చెప్పొచ్చు:

·         ఫిర్యాదీలు పెరిగితే న్యాయం జరుతుందనే భరోసా లేదు పైగా వివిధ పక్షాల వాదనలో తేడాలు, సమన్వయ లోపం వగైరా రావడంతో మొదటికే మోసం రావొచ్చు
·         ప్రస్తుత ఉద్రిక్త రాజకీయ వాతావరణంలో రాష్ట్రాలు విద్యార్తుల కంటే ఎక్కువ ఇతర (ఉ. తమ రాష్ట్రం/అధికార పార్టీ) ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు మెండు
·         అన్నిటి కంటే ముఖ్యంగా విద్యార్తులు తమ వారని అనడం తెలంగాణా ప్రభుత్వానికి ఈ పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత లేదని పరోక్షంగా ఒప్పుకోవడమే అవుతుంది.

అంచేత సీమాంధ్ర & ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు విషయంపై జోక్యం చేసుకొనే హక్కు ఇసుమంతయినా లేదు. మరి ప్రజాహిత యాచ్చికల మాటేమిటి? తప్పకుండా వేయవొచ్చు కానీ అవి వ్యక్తిగత హోదాలో వేయాల్సి ఉంటుంది. భారత సంవిధానం 165 అధికరణ ప్రకారం రాజ్యాంగ హోదాలో ఉన్న రాష్ట్ర ముఖ్య న్యాయవాది వ్యక్తిగత లిటిగేషన్ విషయాలలో సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సరికదా అది కుసంప్రదాయం కూడా కావొచ్చు.

ప్రాధమిక హక్కుల నేపధ్యంలో ఫాస్ట్ పథకం
14 అధికరణ ప్రకారం రాజ్యం దేశ చట్టాలల విషయంలో ప్రతి పౌరుడికి సమాన రక్షణ కల్పించాలి. విద్య ప్రాధమిక హక్కన్న బాబు గారి వాదన ఆసక్తికరం కానీ దీన్ని ఆర్ధిక సాయానికి విస్తరించలేము. ఒకవేళ ఒప్పుకుంటే వారి పార్టీ గత ప్రభుత్వాన్నే తప్పు పట్టినట్టు అవుతుంది J

15 (1) అధికరణ ప్రకారం రాజ్యం కేవలం కుల/మత/లింగ/జన్మస్థాన పరంగా ఎవరిపై వివక్ష చూపలేదు. పరిశీలిస్తే అధికరణ రాష్ట్రాల/మూలాల ఆధారంగా వ్యత్యాసాన్ని తప్పు పట్టలేదని తెలుస్తుంది. గౌరవ మంత్రి గారికి ముఖ్య న్యాయవాది తప్పు సలహా ఇచ్చారా లేదా వారికి సరిగ్గా అర్ధం కాలేదా అన్న అంశాన్ని వారి విజ్ఞతకే వదిలేద్దాం.

1955 డీపీ జోషీ ఉన్నత ధర్మాసనం కేసులో పరిస్తితులు మనకు ఇక్కడ చక్కగా సరిపోతాయి. మధ్య భారత్ రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ వైద్య కళాశాల రాష్ట్రం నివాసీయులకు ఇతరులకు వేర్వేరు ఆర్ధిక నియమాలను నిర్దేశించింది. అనుబంధ చట్టంలో "రాష్ట్రంలో నివాసం" అనే పదానికి నాలుగింట కనీసం ఏదో ఒక అర్హత ఉండాలని పేర్కొంది. అందులో ప్రధానమైనది "మధ్య భారత్ డోమిసైల్ కలిగి ఉండి ఇతర రాష్ట్ర్రాల డోమిసైల్ స్వీకరించని వ్యక్తులు". జోషీ ఈ నియమం తన 15 (1) హక్కులకు హానికారకమని వాదించాడు.

ముందు న్యాయస్థానం స్థిర నివాసం అనే ప్రాతిపదిక రాష్ట్రాలకు ఆపాదించవచ్చా అనే విషయాన్ని అన్ని కోణాల నుండీ పరిశీలించింది. అలా ఉండడం సరయినదే అని గౌ. ప్రధాన న్యాయమూర్తి బిజన్ కుమార్ ముఖర్జీ తమ తీర్పులో చెప్పారు. దరిమిలా జోషీ 15 (1) వాదనను తిరస్కరిస్తూ కోర్టు "స్థిర నివాసం, జన్మస్థలం వాస్తవంలో కానీ న్యాయంగా కానీ వేర్వేరు అంశాలు. 15 (1) లో జన్మస్థాన ఆధారంగా వివక్ష ఫొర్బిడ్ చేసినంత మాత్రాన నివాసాదార వ్యత్యాసం చెల్లదని నిర్దారించలేము" అంటూ చారిత్రిక తీర్పునిచ్చింది.

371-డీ అధికరణ నేపధ్యంలో ఫాస్ట్
371-డీ చెల్లుబాటులో ఉన్నందున తెలంగాణా ఇవ్వడం కుదరదని చేసిన దుర్బుద్ధి పూరిత ప్రచారాన్ని నేను పూర్తి వివరాలతో తిప్పికొట్టిన విషయం అందరికీ విదితమే. మరో టపాలో 32 రాజ్యాంగ సవరణ, 371-డీ అధికరణ, "ఆరు సూత్రాల పథకం" అంశాల మధ్య ఉన్న లింకులు వివరించాను. ఆసక్తి ఉన్న వారు ఆయా టపాలను చదవగలరు.

371-డీ అధికరణ తెలంగాణా సీమాంధ్ర రాష్ట్రాల డోమిసైల్ నిర్వచించిందా అంటే కాదనే జవాబు చెప్పాలి. అధికరణ కేవలం జోనుల వారీ స్థానికతకు సంబందించినదని స్పష్టం.

2014 తెలంగాణా ఆవిర్భావ చట్టం 371-డీ గురించి ఏమి చెబుతుంది? సెక్షన్ 95 ప్రకారం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఉన్నత, సాంకేతిక & వైద్య కళాశాలలో ప్రవేశాలు పదేళ్ళ పాటు 371-డీ కింద ఉమ్మడి ప్రవేశ వ్యవస్తలో కొనసాగాలి. తద్వారా ఇరు వారస రాష్ట్రాలలో విద్యార్తులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యలలో సమానావకాశం లభిస్తుందని సెక్షన్ చెప్తోంది.

సెక్షన్ 97 371-డీ అధికరణలో మూడు సవరణలు చేసింది. 97 (1) ప్రకారం ఇరు వారస రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాల విద్య/ఉపాధి రంగాల తాలూకా అవసరాల గురించి అలాగే ఆయా రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల ప్రయోజనాల గురించి మార్పులు చేయడం జరిగింది. మిగిలిన మార్పులు అధికరణలో ఒక్క రాష్ట్రం స్థానే రెండు రాష్ట్రాల పేర్లు ఇర్కించడం వల్ల మనకు ఇవి ఆట్టే ఉపయోగం కావు.

పైని చెప్పిన మార్పులు డోమిసైల్ విషయానికి సంబందించినవి కావు. పైగా ఇవి కేవలం ప్రవేశాలకు గురించి మాత్రమె. మంత్రి గారు "అడ్మిషన్ సంబంధ అన్ని విషయాలను" కొనసాగించాలని చట్టం చెప్పిందనడం సత్యదూరం.

ఫాస్ట్ 1956 కటాఫ్
371-డీ & దాని కింద ప్రచురించిన రాష్ట్రపతి ఉత్తర్వులు కేవలం రెండు విషయాలలో ప్రజలను స్థానికులు స్థానికేతరులు అనే రెండు బృందాలుగా విభజిస్తుంది. రెండు సందర్భాలలో సైతం స్థానికత నియమాలు ఒకటే కావు.

స్థానికత అనే ప్రాతిపదిక ప్రవేశానికి తప్ప ఆర్ధిక సాయం వంటి ఇతరత్రా విషయాలకు చెల్లదు. ఫాస్ట్ పరిధి కేవలం ఆర్ధిక సాయానికి స్థిరనివాసం అర్హత. ఇవి రెండు సమాంతర రేఖలు అనడంలో ఎటువంటి సంకోచము అక్కరలేదు. స్థిర నివాసం అనే విషయం 15 అధికరణ పరిధిలోకి రాదని మునుపే చూసాం. స్థిర నివాస కాలమానం కూడా అదే కారణాల చేత అధికరణ లోపలికి రాదు.

అన్ని విశాలను క్షుణ్ణంగా పరిశీలించాక ప్రతిపాదిత ఫాస్ట్ పథకం రాజ్యాంగానికి లోబడే ఉందనీ ఇందులో చట్టవ్యతరిరేకమయిన విషయాలు ఏవీ లేవని ఖండితంగా చెప్పవచ్చు.

ఇక చట్ట పరిధి దాటి చూద్దాం
సాధారణంగా డోమిసైల్ వారసత్వం ఆస్తి పంపకాలు తదనుబంధ విషయాలకు వర్తిస్తుంది. ఫాస్ట్ పథకం డోమిసైల్ నిర్ణయిస్తే అనేక చట్టాలు (ఉ. మహిళలకు ఆస్తి హక్కుల పరిరక్షణను మెరుగు పరచడం) దాన్నే అనుసరించాలి. ప్రత్యామ్నాయంగా వేర్వేరు చట్టాలకు వేర్వేరు డోమిసైల్ నిర్వచించడం అపోహలకు, అనర్ధాలకు & గందరగోళానికి దారి తీస్తుంది.

డోమిసైల్ పూర్తిగా స్వచ్చందం, పైగా శాశ్వతం కాదు. ఎందరో వ్యక్తులు తమ నివాసాన్ని ఎన్నో సార్లు మార్చవచ్చు. ఉ. వ్యవసాయ ఆధార ప్రాంతాలలో వలసలు సర్వసాధారణం. అంచేత 1956లొ తెలంగాణాలో నివాసం ఉండగానే సరిపోదు అదే స్థితి నేటి వరకు కొనసాగాలి.

అర్హతలు ఎంత జాగ్రత్తతో కూడిన భాషలో రాసినా తప్పులు/అసగ్రమతలు దొర్లే అవకాశాలు జాస్తి. దీంతో అనవసరమయిన గొడవలు, వాటిపై మీడియాలో లొల్లి లాంటివి ఉంటాయని వేరే చెప్పనక్కరలేదు. గోరితో పోయేదానికి రోకలి ఎందుకో ఏమో?

కాలం చెల్లిన ఫీజు రీ-ఇమ్బర్సుమెంటు పథకం భయంకరమయిన లూటీకి నిలయమని మిత్రులు చెప్తున్నారు. దిగజారిన విద్యా నాణ్యత, కాలేజీ యాజమాన్యం జులుం లాంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. ఇవి కొద్దోగొప్పో నిజం అయినా రోగానికి ఫాస్ట్ పథకం ఎలా వైద్యం చేస్తుందో నాకయితే అర్ధం కాలేదు.

గతంలో ఆంద్ర ప్రభుత్వం 1950 కటాఫ్ తేదీ వాడింది కాబట్టి ఇప్పుడూ అలా చేయొచ్చనె వాదనలో పస లేదు. విషయాన్ని నిశితంగా పరీక్షిస్తే తప్ప అది ఇప్పుడు అన్వయించగలమా లేదా అని కరారు చేయలేము.

1956 ప్రస్తావన ఎటూ వచ్చింది కాబట్టి ఉద్యమంలో నా లాంటి వారు ఎందరో 1956 విలీనం జరగకుండా ఉంటె ఎలాంటి రాష్ట్రం వచ్చేదో దానికి అయినంత దగ్గరగా తెలంగాణా ఏర్పడాలని కోరుకున్నామని గుర్తు చేసుకుందాం. 1956లొ ముల్కీ నియమాల ప్రకారం 15 వర్షాల స్థిర నివాసం ఏర్పరుచుకొని తమ స్వస్థలానికి వెనక్కు వెళ్ళే ఆలోచన మానేసిన వారికి దోమిసైల్ అర్హతలు వస్తాయి. ఫాస్ట్ సహూలతు ఇవ్వడం లేదు.

మనం మానవ కోణంలో చూడాల్సిన అవసరం ఎంతయినా ఉంది. హైదరాబాదు రాష్ట్రాన్ని విచ్చిన్నం చేసిన దరిమిలా పదేసి వేలల్లో వచ్చిన వారికి అప్పటికీ ఇప్పటికీ తెలంగాణతో గట్టి బంధాలు ఉన్నాయి. 1956 విలీనం తరువాత ఇంకా ఎందరో పొట్టకూటికి వచ్చారు.

తెలంగాణకు వచ్చిన వారిలో ఎందరో ఆంధ్రులు ఉన్నా వారొక్కరే వచ్చారని చెప్పలేము. అలా వచ్చిన ఆంద్రులలో కొద్ది మంది మన ఉద్యోగాలు మనకు కాకుండా చేసారు. ఇంకొంత మంది మన సంస్కృతిని అవహేళన చేసిన మాట కూడా వాస్తవమే. అయితే అత్యధికులు తెలంగాణా జనజీవనంతో & మన గంగా జమునీ తహ్జీబుతొ పూర్తిగా మమేకం అయ్యారు. కొందరు చేసినదానికి అందరినీ అనడం హేతుకత అనిపించుకోదు. పది మంది అపరాదులు తప్పించుకున్నా ఒక్క నిరపరాదికి శిక్ష పడ రాదన్న బ్లాక్వెల్ల్ సూత్రం గుర్తు చేసుకుందాం.


ప్రతిపాదిత 1956 కటాఫ్ తొలగించమని తెలంగాణా ప్రభుత్వానికి ఇదే నా విజ్ఞప్తి.

10 comments:

  1. చాలా బాగా రాసారు జై గారు. మీ మొదటి తెలుగు టపా విషయమై మీకు నా అభినందనలు మరియు అనేక విషయాలు తెలియ చెప్పినందుకు ధన్యవాదములు.

    ప్రతిపాదిత 1956 కటాఫ్ తొలగించమని తెలంగాణా ప్రభుత్వానికి ఇదే నా విజ్ఞప్తి.

    నా విజ్ఞప్తి కూడా.

    ReplyDelete
    Replies
    1. థాంక్సండీ.

      తెలంగాణా విజ్ఞప్తులు చేస్తే రాలేదు, కొట్లాడితే వచ్చింది. అదేరకంగా కొట్లాడాలే కానీ మన ముందున్న ఎన్నో విషయాల ముందు ఇది చిన్నది.

      Delete
  2. మీ తెలుగువ్యాసం బాగుంది. అవసరమైన సరళత, స్పష్టత, క్లుప్తత అనేవి చక్కాగా ఉన్నాయి.
    కొనికొన్ని అక్షరదోషాలు ఉన్నాయి. ఒకసారి చూసి సరిచేసుకోండి. కొన్ని మాటలు నాకు అర్థం కాలేదు. ముఖ్యంగా సహూలతు, తహ్జీబు అనేవి.

    కొన్ని పదబంధాలు మార్చితే బాగుంటాయి. ఉదా: కొందరు చేసినదానికి అందరినీ అనడం హేతుకత అనిపించుకోదు. ఇక్కడ సహేతుకం అనిపించుకోదు అంటే ఇంకా బాగుంటుంది.

    మొత్తం మీద చాలా బాగున్నది మీ తెలుగుసేత.

    ReplyDelete
    Replies
    1. మీ ప్రోత్సాహానికి మరొక్కసారి ధన్యవాదాలు.

      పదాలు సరిగ్గా పడడం లేదని నాక్కూడా మధ్యమధ్యలో అనిపించింది. ఈసారి ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటాను.

      సహూలట్ లత్ అనే మాట వాడకం ఇటీవల తగ్గింది. దీనికి సౌకర్యం, వెసులుబాటు, convenience లాంటివి కొంచం దగ్గర.

      "గంగా జమునీ తహ్జీబు" తెలంగాణా మిశ్రమ సంస్కృతి ప్రతిరూపం. ఒక్కోసారి పంచవేణీ సంగమం కూడా అంటారు.

      Delete
  3. జై గారు, మీ వ్యాసం వ్రాసిన తీరు బాగుంది. తెలుగులో బాగా వ్రాసినందులకు అభినందనలు. వివరణలు - గత ఉదాహరణలు - న్యాయపరమైన అంశాలు - రాజకీయ కోణాలు - మానవీయ కోణం అన్నీ స్పృశించి చివరికి మీరు తేల్చిన మరియు తెలంగాణా ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి బాగుంది.

    << తెలంగాణకు వచ్చిన వారిలో ఎందరో ఆంధ్రులు ఉన్నా వారొక్కరే వచ్చారని చెప్పలేము. అలా వచ్చిన ఆంద్రులలో కొద్ది మంది మన ఉద్యోగాలు మనకు కాకుండా చేసారు. ఇంకొంత మంది మన సంస్కృతిని అవహేళన చేసిన మాట కూడా వాస్తవమే. అయితే అత్యధికులు తెలంగాణా జనజీవనంతో & మన గంగా జమునీ తహ్జీబుతొ పూర్తిగా మమేకం అయ్యారు. కొందరు చేసినదానికి అందరినీ అనడం హేతుకత అనిపించుకోదు. పది మంది అపరాదులు తప్పించుకున్నా ఒక్క నిరపరాదికి శిక్ష పడ రాదన్న బ్లాక్వెల్ల్ సూత్రం గుర్తు చేసుకుందాం.>>


    <>

    ఈ రెండు పేరాలు చాలు. మొత్తం మీ వ్యాసం గోల్ అవగతం కావడానికి. మీరు కోరినట్లుగా తెలంగాణా ప్రభుత్వం 1956 కటాఫ్ తొలగిస్తుందని ఆశిస్తున్నాను. నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. థాంక్సండీ.

      తెలంగాణా విజ్ఞప్తులు చేస్తే రాలేదు, కొట్లాడితే వచ్చింది. అదేరకంగా కొట్లాడాలే కానీ మన ముందున్న ఎన్నో విషయాల ముందు ఇది చిన్నది.

      Delete
  4. జై గారు,

    మీ విశ్లేషణ అంశాల వారీగా చెప్పిన విధానం చాలా బాగుంది. ఏదైనా ఒక విషయం గురించి చెప్పేటప్పుడు రెండు పద్దతులు అనుసరిస్తాము. ఒకటి ఏమిటంటే వాస్తవములతో పని లేకుండా పూర్తిగా మనకు అనుకూలంగా మాట్లడడం.. రెండోది ఏమిటంటే వాస్తవములను ఉన్నదున్నట్టుగా మాట్లాడడం.
    పై విశ్లేషణ రెండో పద్దతిలోకి వస్తుంది.
    ఏదైనా విషయములో అనుకూల, ప్రతికూలతలనేవి సహజం.. మీరు ఆ రెండింటిని చెప్పారు. చాలా బాగుంది...

    "అలా వచ్చిన ఆంద్రులలో కొద్ది మంది మన ఉద్యోగాలు మనకు కాకుండా చేసారు"

    ఈ విషయములో నాది చిన్న అబ్జెక్షన్. ఎందుకంటే ఉద్యోగాలనేవి సమర్దతను బట్టి వస్తాయి. అంతే కాని ఫలానా అంధ్ర ప్రాంతం వాడని బొట్టు పెట్టి ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరు. ప్రతిభ ఉన్న చోట ప్రాంతీయత అడ్డంకి కాబోదు. నేను జాబు చేస్తూ MCA కంప్లీట్ చేసి జాబు కోసం హైదరబాదులో రెండేళ్ళు ఉద్యోగం కోసం ట్రై చేసాను. కానీ నాకు జాబు రాలేదు. దానికి కారణం నేను ఆంధ్రప్రాంతంనకు చెందినవాడినని కాదు. దానికి తగ్గ సమర్దత నాకు లేకపోవడమే...

    ReplyDelete
    Replies
    1. ఇక్కడ నేను మాట్లాడుతున్నది ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాత్రమేనండీ.

      Delete
  5. ఇంగ్లీషులో మీరు వ్రాసిన ఆర్టికల్స్ చాలా బాగున్నాయండీ.. సింపుల్ గా అర్ద్రమయ్యే పదాలతో అంత చక్కగా వ్రాయగలుగుతున్న మిమ్మల్ని చూస్తే కొద్దిగా అసూయగా కూడా ఉంది నాకు మీ మీద...

    మీ బ్లాగు చూడడం ఇదే మొదటి సారి. ఓపెన్ చేసిన తర్వాత ఇదొక్కటే తెలుగులో ఉంది. మిగతావన్ని ఇంగ్లీషులోనే.. ఏమిటి రా బాబు.. మనకు అర్ద్రమవుతుందా అనుకుంటునే ఓపెన్ చేసాను. కానీ చక్కగా అర్ద్రమయ్యాయి...

    ReplyDelete
    Replies
    1. థాంక్సండీ.

      నిజానికి నేను తెలుగులో రాయగలనా అని నాకే సందేహంగా ఉండేది. కామెంట్లు మాత్రం అడపాదడపా తెలుగులో రాసేవాణ్ణి. కొందరు పెద్దలు & మిత్రులు (ముఖ్యంగా శ్యామలీయం మాస్టారు) ఫరవా లేదు నువ్వు తెలుగులో టపా రాయి అంటూ ప్రోత్సహించారు.

      వారి ప్రోద్బలంతో చిన్న ప్రయోగం చేసాను. మున్ముందు తెలుగులో రాస్తానా లేదా ఇంకా తెలీదు!

      Delete

Please be brief. Please respect everyone's privacy and do not reveal any private information about yourself or others.

Suggestions on improving the quality of this blog are always welcome. All other comments should be relevant to the subject of the post. I will delete all spam and messages with abusive or vulgar language.

All material in my blog is original. I will remove any copyrighted material if notified.

You may not use the material from my blog without my permission. I will not refuse any reasonable request as long as you credit me and provide a link to my own post.

If you post rejoinders, rebuttals or supplementary posts in your own blog, please leave a comment with a link.